కేసీఆర్.. టాప్ గేర్: ప్రగతి నివేదనకు సర్వం సిద్ధం
జోగులాంబ గద్వాల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వరుసగా జిల్లాల పర్యటనలను చేపట్టారు. ఇటీవలే నాగర్‌కర్నూల్‌లో పర్యటించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలు, బీఆర్‌ఎస్ జిల్లా ఆఫీస్‌ను ప్రారంభించారు. దీని తరువాత మంచిర్యాల్‌లో పర్యటించారాయన. కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ప్రగతి నివేదన పేరుతో బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్- సింగరేణి కార్మికులపై వరాల జల్లు కురిపించారు. వారికి 700 కోట్ల రూపాయల దసరా బోనస్‌ను ప్రకటించారు. అలాగే వికలాంగుల పింఛన్ మొత్తాన్నీ 1,000 రూపాయలకు పెంచారు. రూ.3,116 ఉన్న పింఛన్ మొత్తాన్ని ఒకేసారి 4,116 రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోందని, దీన్ని అడ్డుకుని తీరుతామనీ స్పష్టం చేశారు. ఇవ్వాళ ఆయన- మరో జిల్లా పర్యటనకు పూనుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు వెళ్లనున్నారు.
అక్కడ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సారి కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు చురుగ్గా పని చేస్తోన్నారు. గద్వాల్‌లోని ఐజ రోడ్‌లో ఈ సభ జరుగనుంది.
లక్షమందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరలింపు కోసం సమాయాత్తమౌతోన్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గద్వాల్ టౌన్ గులాబీమయమైంది. ప్రధాన రహదారులన్నీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆయా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు.












Click it and Unblock the Notifications