కొత్త ఎమ్మెల్సీలుగా రేవంత్ మార్క్ ఎంపిక..!!
తెలంగాణలో కొత్తగా అయిదుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. నాలుగు స్థానాలు కాంగ్రెస్.. ఒక్క స్థానం బీఆర్ఎస్ కు దక్కనున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ఇదే సమయంలో రేవంత్ కొత్త ఫార్ములా అమలు చేస్తున్నారు. సీపీఐ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఎంఐఎం కు సీటు ఇచ్చే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కే జాబితా పైన ఒక స్పష్టత వస్తోంది.
ఎవరికి ఎన్ని సీట్లు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు పైన రేవంత్ ఫోకస్ చేసారు. ఇప్పటికే అవకాశం ఎవరి కి ఇవ్వాలనే అంశం పైన చర్చలు జరిగాయి. నాలుగు సీట్లు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. అయితే, ఎంఐఎం కు ఒక సీటు ఇవ్వటం ద్వారా దోస్తీ కొనసాగించాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ విషయం పైన పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మిత్రపక్షం సీపీఐకు ఒక ఎమ్మెల్సీ పైన కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది. దీంతో..ఈ రెండు స్థానాల కేటాయింపు పైన స్పష్టత ఆధారంగా మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

రేవంత్ ఛాయిస్
ముఖ్యమంత్రి రేవంత్ సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డికి ఈ సారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక వేళ అవకాశం లేకుంటే..రాజ్యసభకు పరిశీలన చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక సీటు సీపీఐకి ఖాయం కావటంతో..మిగిలిన స్థానాల కోసం సామాజిక వర్గాల వారీగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, హరి వర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, చరణ్ కౌశిక్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అదే విధంగా పార్టీ సంస్థాగత కోటాలో కుమార్‌రావు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ పేర్లను పరిశీలిస్తున్ నట్లు సమాచారం.
సమీకరణాలే కీలకం
ఎస్సీ సామాజికవర్గం నుంచి ఒకరు ఎమ్మెల్సీ కానున్నారు. దీంతో మాదిగ వర్గానికి కేటాయించాలా? మాల వర్గానికా? అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌కు సీటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అభిప్రాయాన్ని మరి కొందరు పార్టీ ముఖ్యులు తెరపైకి తెచ్చారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ రేసులో తొలి వరుసలో ఉన్నారు. ఇక మహిళా కోటాలో పారిజాత నర్సింహారెడ్డి, బాణోతు విజయాబాయి రేసులో ఉన్నారు. పార్టీ నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో చర్చల తరువాత తుది ఆమోదం కోసం పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. దీంతో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు.












Click it and Unblock the Notifications