చంద్రబాబుతో భేటీకి టైం ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి
Chandrababu Naidu and Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు రేవంత్ రెడ్డి. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి పదేళ్లు దాటింది. 2014లో విభజన జరిగినా.. ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయి. మొన్నటివరకు ఉమ్మడి రాజధానిగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ కాల పరిమితి సైతం ముగిసిపోయింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీతో పరిపాలనపరంగా హైదరాబాద్‌తో ఏపీకి ఉన్న సంబంధాలు తెగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
గతంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. రెండుమూడుసార్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యారు గానీ సమస్యలు పెద్దగా కొలిక్కి రాలేదు. ఈ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను దాఖలు చేశారు.
రాష్ట్ర విభజన సహేతుకంగా జరగ లేదని, ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది వారి వాదన. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని వారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమౌదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు.
ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. 6వ తేదీన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే భవన్‌లో సమావేశమౌదామని చెప్పారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు తెలిపారు. ముఖాముఖి సమావేశం ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకుందామంటూ చొరవ తీసుకోవడం, ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తోన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలా పరస్పరం సమావేశం కావడం ద్వారా రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతాయని, ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications