భారీ వర్షాలు: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, హైదరాబాద్‌లో స్కూల్స్ బంద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాలని సీఎస్‌కు సూచించారు.
ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న క్రమంలో ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం జిల్లా కలెక్టర్ సెలవును ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు
జారీ చేశారు.
భారీ వర్షాల అలర్ట్: హైదరాబాద్‌లో విద్యాలయాలకు సెలవు
హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏవైనా సమస్యలు ఉంటే హైదరాబాద్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని సూచించారు. మరోవైపు, భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్ పరిధిలో విద్యాలయాలకు సోమవారం సెలవు ప్రకటించారు.
తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.
శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఇందు కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో దీని ప్రభావం తెలంగాణపై పడి మోస్తరు నుంచి భారీ కురుస్తాయని చెప్పారు.
కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. అనంతరం వాయుగుండం పోతుంది అప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications