CM Revanth Reddy: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్..
తెలంగాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ప్రాంగణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కూమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పార్టీ నేతలు పాల్గొన్నారు.
తొలుత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఆగస్ట్ 20న విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోతున్నారని.. అందకే సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారని చెబుతున్నారు. అయితే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేస్తోంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేశారు. వచ్చే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగారాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానపరిచారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పా అని ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు.
యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకు రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు ఒకటి అంటే తాము రెండు అంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications