హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రివ్యూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టులపై శనివారం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జిపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
30 నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ సూచించారు. చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి నిర్మాణం, పరిసరాలను రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు.

2.425 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు మూడు ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, హైదరాబాద్ నగరంలోని రోడ్ల విస్తరణపైనా పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి నదీ అభివృద్ధి సంస్థ జేఎండీ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications