రేవంత్ స్పెషల్ ఫోకస్ - కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతోంది. ఏడాది కాంగ్రెస్ పాలన వేళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ వరుస జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జిల్లాల్లో పలు వరాలు ప్రకటిస్తున్నారు. కొత్తగా అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన రేవంత్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రేవంత్ ఫోకస్
ముఖ్యమంత్రి రేవంత్ వేములవాడ రాజన్న ఆలయం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ముఖ్యమంత్రి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఇక..రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేసారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, భూమి పూజలు చేయనున్నారు.

వరాల ప్రకటన
సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వరాలు అందించారు. తొలి ఏడాది పాలనలో మొత్తం రూ.694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు. ఈ రోజు పర్యటనలో సీఎం రేవంత్ రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయటం తో పాటుగా పూర్తి చేసేందుకు కార్యాచరణ ఖరారు చేసారు.
వరుస ప్రారంభోత్సవాలు
ఇక, రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేస్తారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల లో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించ నున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications