పది ఫలితాల వేళ బిగ్ అప్డేట్- చివరి నిమిషంలో మారిన నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం అయింది. ఈ మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం రేవంత్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సారి ఫలితాల వేళ అనేక చర్చల తరువాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో తిరిగి మార్కులు కనిపించనున్నాయి. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం పైన ఫలితాల వేళ చర్చ జరుగుతోంది. ఇక.. ప్రభుత్వం ఈ సారి ఫలితాలను మరింత సులభంగా తెలుసుకునే విధంగా విద్యార్ధుల కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది.
పది ఫలితాలు
పదో తరగతి ఫలితాల మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. ఫలితాల విడుదల ఆలస్యం కావటంతో విద్యార్ధులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సారి పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు కనిపించనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ ఫలితాలకు సంబంధించిన మెమోల్లో మార్కులనే పేర్కొననున్నారు. అలాగే, 20 ఇంటర్నల్ మార్కులకూ ఇంతవరకూ గ్రేడింగ్ విధానమే ఉండగా.. దీని స్థానంలో మార్కులు ప్రకటించనున్నారు.

కొత్త మెమో విడుదల
కొత్త మెమో నమూనాను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తామని అందులో అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి ఫలితాలను పాస్, ఫెయిల్ అని స్పష్టం గా పేర్కొననున్నారు. అయితే, ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా విద్యార్ధుల పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందనే వాదన తెర మీదకు వచ్చింది. విద్యార్థు లపై మార్కుల ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే దశాబ్దంన్నర కిందట ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 2009-10 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తెచ్చారు. అయితే, అకస్మాత్తుగా దీనిని తొలగిస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకోవడం పైన చర్చ జరుగుతోంది. ఇక ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ చెక్ చేసుకోవచ్చు.
జీపీఏ విధానం స్థానంలో
ఈ సారి జీపీఏ విధానం తొలిగించి సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్ల ను ప్రకటించనున్నారు. ఈ ఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులను నిర్వహిం చారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంట ర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యా శాఖ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండటంతో.. స్వయంగా సీఎం ఈ ఫలితాలను రవీంద్ర భారతిలో విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేసారు.












Click it and Unblock the Notifications