ఢిల్లీకి రేవంత్, మంత్రివర్గ విస్తరణ - ఛాన్స్ దక్కేదెవరికి..జాబితాలో..!!
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవుల పైన రేవంత్ హైకమాండ్ చర్చించనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో...ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్ సభ అభ్యర్దుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక, మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైంది.
కీలక నిర్ణయాలు : రేవంత్ రెడ్డి పాలనలో..పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలకు హైకమాండ్ అనుమతితోనే అమలు చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఢిల్లీ పర్యటనలో పూర్తిగా పార్టీ పరంగా నియామకాలకు సంబంధించిన చర్చలు..ఆమోదం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది.

వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలుగా ఓడిన వారు ఉన్నారు.
మంత్రివర్గ విస్తరణ : సీఎం రేవంత్ ఇప్పటికే తన టీంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో డిసైడ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు రేసులో ఉన్నా..లోక్ సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన నడుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని సమాచారం. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

శాఖల కేటాయింపు : షబ్బీర్ అలీ పార్టీలో సీనియర్ కావటంతో నిజామాబాద్ అర్బన్‌లో ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్ పోటీలో ఉన్నా..షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది. సాగుతోంది. దీంతో..కేబినెట్ విస్తరణ - శాఖల ఖరారు పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications