ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. సభలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 14) జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్సీఈఆర్టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితి 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధన మాత్రం సవరించలేదన్నారు సీఎం రేవంత్.

ఈ నిబంధనను కూడా సవరించుకుని.. 21 ఏళ్లు నిండినవారు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలన్నారు. దీంతో యువత చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు.. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ సభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా అని రేవంత్ రెడ్డి తెలిపారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications