స్మిత సబర్వాల్ నేమ్..ఫేమ్ అవుట్
Smita Sabharwal IAS: తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మిత సబర్వాల్.. వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. దివ్యాంగులపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్రత చల్లారట్లేదు. రోజురోజుకూ తీవ్రతరమౌతూనే వస్తోంది. తాజాగా ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కూ చేరింది.
మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ విషయంలో స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. తప్పుడు ధృవీకరణ పత్రాలను జత చేసి, దివ్యాంగుల కోటాలోనే ఐఎఎస్‌కు ఎంపికయ్యారామె. దీనిపై వివాదం కొనసాగుతోంది. పూజా ఖేడ్కర్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

దీనిపై స్మిత సబర్వాల్ స్పందించారు. సివిల్స్‌కు దివ్యాంగులను ఎంపిక చేయడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాలను ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కోటా ఉండటాన్ని వ్యతిరేకించారు. దీనిపై వివాదాలు చెలరేగుతున్నాయి.
దివ్యాంగులకు ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఊపందుకుంది. తెలంగాణ వికలాంగుల హక్కుల రక్షణ పోరాట సమితి సహా పలు ప్రజా సంఘాలు స్మిత సబర్వాల్‌కు వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఆమెపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ పట్టుబట్టుతున్నాయి.
తాజాగా ఆమెపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు అందాయి. స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వికలాంగులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ వికలాంగుల హక్కుల రక్షణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వికలాంగుల కోటా వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, వికలాంగుల హక్కుల జాతీయ వేదికల్లోనూ ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఎన్‌పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. దివ్యాంగుల పట్ల తీవ్ర పక్షపాతంతో ఆమె వ్యాఖ్యానించారని అన్నారు.












Click it and Unblock the Notifications