సర్వే అధికారుల అడ్డగింతలు.. మూసీ నిర్వాసితుల ఆందోళనలు.. ఉద్రిక్తత!
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా దూకుడు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని చెరువులలో ఆక్రమణలు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలను తొలగించడం పైన దృష్టి సారించిన హైడ్రా బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టింది.
మూసీ ప్రక్షాళనలో ఇళ్ళకు మార్కింగ్.. స్థానికుల ఆందోళన
తాజాగా మూసి ప్రక్షాళనలో భాగంగా మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాలలో సర్వే నిర్వహించి తొలగించవలసిన ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. మూసీ ఎఫ్టీఎల్ పరిధిలోను, మూసి రివర్ బెడ్ పరిధిలోనూ ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్కడికి అక్కడ స్థానికులు అధికారులను అడ్డుకుంటున్నారు.

పెట్రోల్ పోసుకున్న యువకుడు.. ఉద్రిక్తత
చైతన్యపురి వినాయక్ లో మూసి సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డగించి తమ ఇళ్ళు కూల్చవద్దని తమకు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయని ఒకవేళ తాము నిర్మించుకున్నది అక్రమమే అయితే అధికారులు నాడు అనుమతి ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏకంగా ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడి తన ఇంటిని కూల్చితే సూసైడ్ చేసుకున్న చచ్చిపోతానని బెదిరించాడు.
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై ఆందోళనలు
ఇక మహిళలు అధికారుల మీద తిరగబడ్డారు. సర్వే చేయద్దు వెళ్లిపోండి అంటూ రాజేంద్రనగర్ తహసీల్దార్ సిబ్బందిని, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ అధికారులను మహిళలు హెచ్చరించారు. మరోవైపు డిఫెన్స్ కాలనీవాసులు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగురోడ్డు వద్ద రోడ్డు పైన బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
మూసీ నిర్వాసితుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్
రింగ్ రోడ్డు పిల్లర్ 102 వద్ద డిఫెన్స్ కాలనీ, ఆశ్రమ్ నగర్ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళనకు దిగిన వారు తమకు న్యాయం జరిగే వరకు అక్కడ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్తున్నారు. రోడ్డుకు అడ్డంగా కాలనీవాసులు బైటాయించటంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చేతులెత్తేసిన పోలీసులు.. నిరసన కొనసాగిస్తున్న స్థానికులు
దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసిన అది సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించమని కాలనీవాసులు తేల్చి చెబుతూ నిరసన కొనసాగించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications