బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి - అమిత్ షా తో భేటీ: టార్గెట్ రేవంత్..!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలోకి ఎంట్రీ ఖాయమైంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్రి భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోం మంత్రిని కలిసారు. ఆయన ఢిల్లీ వచ్చిన సమయం నుంచి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే, తాను పార్టీ మారేందుకు కాదని..తాను వ్యక్తిగత పనులపై ఢిల్లీకి వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు అమిత్ షా తో భేటీ సమయంలో బీజేపీ లో చేరిక ఖరారైంది.

రేవంత్ పై అసంతృప్తి
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత క్రమేణా శశిశధర్ రెడ్డి పార్టీ వ్యవహారాలతో దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక సమయంలో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో పాటుగా రేవంత్ పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ లో కల్లోలానికి ఆ ఇద్దరే కారణమని ఆరోపించారు. చెన్నారెడ్డి మరణం తరువాత ఆయన వారసుడిగా కాంగ్రెస్ అధినాయకత్వంతో శశిధర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ మాట చెల్లుబాటు అవుతున్న సమయంలో దివగంత నేత పీ జనార్ధన్ రెడ్డి - మర్రి శశిధర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1992 ఉప ఎన్నకతో పాటుగా 1994,2004,2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.

పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు
2014 ఎన్నికల్లో నాడు టీడీపీ నుంచి పోటీ చేసిన తలసాని చేతిలో శశిధర్ రెడ్డి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సనత్ నగర్ టీడీపీకి కేటాయించారు. మరోసారి తలసాని టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. శుక్రవారం హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి పైన టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి విషయాన్ని పార్టీ నేతలు అమిత్ షా కు వివరించారు. ఆ వెంటనే శశిధర్ రెడ్డి తో సమావేశం జరిగింది. హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తరువాత తన అనుచరులు, మద్దతు దారులతో సమావేశమై బీజేపీలో అధికారికంగా చేరే అంశం పైన శశిధర్ రెడ్డి నిర్ణయం ప్రకటించనున్నారు. అయితే, పార్టీ వీడే సమయంలో శశిధర్ రెడ్డి మరోసారి రేవంత్ వ్యవహార శైలి పైనే టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

శశిధర్ రెడ్డి బాటలోనే మరి కొందరు
మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తే...తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారిని టీఆర్ఎస్ నేతలు తిరిగి తమ పార్టీలోకి తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న మర్రి కుటుంబం నుంచి ఇప్పుడు సీనియర్ నేత బీజేపీలో చేరటం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే తరహాలోనే పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లొ మరి కొన్ని చేరికలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, రానున్న అసెంబ్లీ ఎన్నికల వేళ..ఈ ఆపరేషన్ ఆకర్ష్ మరింత ముమ్మరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications