తెలంగాణలో కాంగ్రెస్ కర్నాటక సక్సెస్ ఫార్ములా ! అభ్యర్ధుల ప్రకటన ఆలస్యం వెనుక ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిచి తీరాలని పట్టు దలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఈసారి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులలో 90 శాతం మందిని ఖరారు చేసేసిన కాంగ్రెస్... మిగతా స్ధానాల్లోనూ కసరత్తు పూర్తి చేస్తోంది. పలు చోట్ల అభ్యర్ధులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితా ఆలస్యమవుతుందని భావించినా.. అంతకు మించిన సమీకరణాలన్ని కాంగ్రెస్ పెద్దలు వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊపుతెచ్చేందుకు పనికొచ్చిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆ పార్టీకి అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో బీజేపీని మట్టికరిపించి విజయం సాధించడం ఓ ఎత్తయితే ప్రత్యర్ధులు ఊహించని స్ధాయిలో సీట్లు కైవసం చేసుకోవడానికి వెనుక ఉన్న కారణాల్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడం లేదు. దీంతో ఇప్పుడు అదే ఫార్ములాని తెలంగాణ అసెంబ్లీ పోరులోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక ఈసారి మార్చిన సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. అక్కడ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కానుగోలు.. ఇప్పుడు తెలంగాణలోనూ వాటిని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు సాధించింది. 2019లో జగన్ కూడా ఇదే తరహాలో పలు జనరల్ సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించి ఏపీలో మంచి ఫలితాలు అందుకున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇదే వ్యూహం అమలు చేయబోతోంది.

ముఖ్యంగా ఖమ్మంతో పాటు వరంగల్ వంటి రిజర్వుడ్ స్ధానాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వీలైనన్ని చోట్ల ఈ ఫార్ములాను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫార్ములా తెలంగాణలో ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే ఇలాంటి భిన్నమైన వ్యూహాల్ని అమలు చేయాల్సిందేనన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో దసరా తర్వాతే కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications