రైతు రుణమాఫీ దెబ్బ: చీకట్లో దాడి- కాంగ్రెస్ మొహబ్బత్ కా దుకాణ్ ఇదేనా?
T Harish Rao: సిద్ధిపేట్‌లో కలకలం చెలరేగింది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు, మాజీ మంత్రి టీ హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడి చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఈ దాడికి పాల్పడ్డారు. ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. ఫలితంగా- స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతు రుణమాఫీ పథకం అమలు వ్యవహారం దీనికి కారణం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీ నాటికి సంపూర్ణంగా రైతుల రుణాలను మాఫీ చేయగలిగితే తాను పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలో హరీష్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.

చెప్పినట్టుగానే- మూడు విడతల్లో సంపూర్ణ రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది తెలంగాణ సర్కార్. రెండు లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేసింది. పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్న రైతులకు దీన్ని వర్తింపజేసింది. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభ ద్వారా మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
చెప్పినట్టుగానే తమ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసిందని, హరీష్ రావుకు దమ్ము ఉంటే వెంటనే రాజీనామా చేయాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి అనుగుణంగా ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేట్, హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
ఈ క్రమంలో వాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. సిద్ధిపేట్‌లో గల హరీష్ రావు అధికారిక క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగారు. ధ్వంసం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. తాళాలను పగులగొట్టి ఆఫీస్‌లోకి దూసుకెళ్లారు. ఫర్మిచర్, కుర్చీలను విరగ్గొట్టారు. క్యాంప్ కార్యాలయం అని రాసివున్న భారీ బోర్డును పీకి పక్కనపడేశారు.
ఈ ఘటనపై హరీష్ రావు మండిపడ్డారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్‌పై దాడికి దిగిన వీడియోను హరీష్ రావు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను గూండాలుగా అభివర్ణించారు. ఈ దాడి అప్రజాస్వామ్యమంటూ విమర్శించారు.
ఈ దాడిని అడ్డుకోవడానికి పోలీసులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని, ఇంత జరుగుతుంటే వాళ్లెందుకు జోక్యం చేసుకోలేదంటూ నిలదీశారు. నిందితులకు రక్షణ కల్పించినట్లుగా తాను భావించాల్సి వస్తోందంటూ ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే అధికారిక నివాసం మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే.. ఇక సామాన్య పౌరుల సంగతేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications