భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు కరోనా అలెర్ట్!!
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి కేసులు మళ్ళీ దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, వాసన, రుచి కోల్పోవటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాపాయం నుండి కాపాడుకోవాలని అంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వేడుకలు, పండుగల విషయంలో కూడా అలెర్ట్ గా ఉండాలని అంటున్నారు. కరోనా భయం మొదలైన వేళ ముక్కోటి ఏకాదశి వేడుకలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు భద్రాద్రి అధికార యంత్రాంగం. ఈ నెల 23న జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఆలయ పండితులు సర్వం సిద్ధం చేశారు.

దేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భద్రాద్రిలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు ఈసారి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రాచలం ముక్కోటి ఉత్సవాలకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిబంధనలను అమలు చేయాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.












Click it and Unblock the Notifications