టీఎస్ ఎంసెట్‌కు అత్యధిక దరఖాస్తులు: పరీక్షకు లేటైతే అనుమతి లేదు, కీలక సూచనలు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్(EAMCET) సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఎంసెట్‌కు ఈ ఏడాది అదనంగా 50 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకుపైగా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.
మొదటి సారి తెలంగాణలో ఎంసెట్ కు 3 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 8 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశామని ఆయన చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 137 (కొత్తవి 28) సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో 104, ఏపీలో 34 సెంట్లర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సారి ప్రతి సెంటర్లో సిట్టింగ్ అబ్జర్వర్స్ ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులు నిర్ణీత సమయంలోగా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని లింబాద్రి స్పష్టం చేశారు. సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు తల్లిదండ్రుల మీద ఉందన్నారు. పరీక్ష కేంద్రానికి ఒక్క క్షణం లేట్ అయినా పరీక్షా హాల్ లోకి అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులు చూసుకోవాలని ఆదేశించారు.
ఈ సారి ఎడ్ సెట్ ఒకే రోజు సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. ప్రైవేటు యూనివర్శిటీ బిల్లు ప్రాసెస్‌లో ఉందన్న లింబాద్రి.. అనుమతి వస్తేనే యూనివర్సిటీగా అది చెల్లుబాటు అవుతుందన్నారు. లేకపోతే అది కాలేజీగానే పరిగణించబడుతుందని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ ఉన్న రూట్లో ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కోరామని తెలిపారు.
జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా బయో టెక్నాలజీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయన్నారు. కాలేజీల్లో తనిఖీలు మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు. కాగా, మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10,11న అగ్రికల్చర్, మెడికల్, 12, 13,14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications