కత్తితో వచ్చిన దొంగకు చుక్కలు చూపిన దంపతులు, సీపీ ప్రశంస
హైదరాబాద్: తమ ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగను ముప్పుతిప్పలు పెట్టి పరుగెత్తించేలా చేశారు ఓ దంపతులు. దీంతో వారిని అభినందిస్తూ ఏకంగా పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య.. వారికి ప్రశంసా పత్రం అందించారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నార్సింగి పరిధిలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 4వ తేదీన తెల్లవారుజామున 4గంటల సమయంలో పీరం చెరువు స్నేహిత హిల్స్, పెబేల్ సిటీలో నివాసం ఉంటున్న కాంతిగోపాల్ ఇంటి గేటు తాళాలను పగులగొట్టి కత్తితో ఓ దొంగ ప్రవేశించాడు.
ఇంట్లో నిద్రపోతున్న కాంతి గోపాల్ దంపతుల దగ్గరకు వచ్చి కత్తి చూపించిన దొంగ.. నగదు, బంగారం ఇవ్వమని బెదరించాడు. అయితే, గోపాల్ దంపతులు ఏ మాత్రం బెదరలేదు. వెంటనే లేచి దుండగుడిని పట్టుకునేందుకు గోపాల్ ప్రయత్నించగా.. అతడి చేతిలోని కత్తిని గోపాల్ భార్య కర్రతో కొట్టి కిందపడేలా చేసింది.

ఆ తర్వాత అరుపులు కేకలు పెట్టడంతో పక్కనే ఉన్న నర్సింహారెడ్డి అనే వ్యక్తి వచ్చి దొంగ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, దొంగ వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
సమాచారం అందుకున్న నార్సింగి పెట్రోలింగ్ మొబైల్ హెడ్ కానిస్టేబుల్ మాల్య నాయక్, కానిస్టేబుల్ నర్సింగ్ రావులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితల నుంచి వివరాలను అడిగితెలుసుకున్నారు. కాగా, దొంగను ధైర్యంగా ఎదుర్కొని తమను తాము కాపాడుకున్న ఆ దంపతులను సీపీ సందీప్ శాండిల్య సన్మానించి, ప్రశంసా పత్రాలను అందించారు.












Click it and Unblock the Notifications