రైతుల అకౌంట్లలోకి త్వరలోనే ఆ డబ్బు.. మంత్రి కీలక ప్రకటన
ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతన్నలకు అకాల వర్షాలు తీవ్ర నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా కూడా చాలామంది రైతన్నలు పంట నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని దీనంగా ఎదురుచూస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి కూడా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
కీలక ప్రకటన చేసిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు ఊరట కలిగించే కీలక విషయాన్ని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

పంట నష్ట పరిహారం అంచనా వేయటానికి ప్రత్యేక బృందాలు
రాష్ట్రంలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి సత్వరమే పరిహారం అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల చాలా సానుకూలంగా ఉంటుందని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గతంలో కూడా అకాల వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించిందని గుర్తు చేశారు.
మంత్రుల కీలక ప్రకటనలు.. ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎప్పుడో
ఎకరానికి రూ. 10000 చొప్పున నష్టపరిహారం ఇచ్చినట్టుగా పేర్కొన్న ఆయన ఈ సంవత్సరం కూడా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే పంట నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అకాల వర్షాలతో ఇటీవల పంట నష్టపోయిన రైతన్నలు పరిహారం కోసం, ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications