అర్నబ్ తుఫాను ప్రభావం: తెలంగాణలో మరో రెండురోజులు భారీవర్షాలు,ఈ జిల్లాలలోనే!
ఏపీని వణికిస్తున్న అర్నబ్ తుఫాను ప్రభావం తెలంగాణా రాష్ట్రంపైన కూడా పడుతోంది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో వాతావరణం మారిపోయింది. అక్టోబర్ 28 తెల్లవారుజామున నర్సాపూర్, యానాం సమీపంలో తీరం దాటిన ఈ తీవ్ర తుఫాను గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో, కొన్నిచోట్ల 150 కిలోమీటర్ల వరకు గాలులు వీచి ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ తీవ్ర తుఫాను వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణలోకి ప్రవేశించింది.
ఫలితంగా తూర్పు, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో వాతావరణం తుఫాను ప్రభావితంగా మారింది. అర్నబ్ తుఫాను ఫలితంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు చోట్ల చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.

వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, నల్గొండ వంటి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.హైదరాబాద్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నా, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లగా మారి, చలి కాస్త పెరిగింది. నేడు, రేపు కూడా తూర్పు తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఉత్తర జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ వైపు కూడా వర్ష ప్రభావం విస్తరించే అవకాశం ఉంది. రైతులకు ఈ వర్షాలు రెండు రకాలుగా ప్రభావం చూపుతున్నాయి.
ఎల్నినో ప్రభావంతో ఎండలు మెండుగా ఉన్న సమయంలో పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు, గాలులు పత్తి, వరి వంటి పంటలను నీటిపాలు చేస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో చేలల్లోనే తడిసి రంగు మారుతున్న పత్తి పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు రైతులను అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. గత తుఫాన్ల అనుభవాల దృష్ట్యా కూడా అధికారులు అలెర్ట్ అయ్యారు.













Click it and Unblock the Notifications
