వైఎస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం - డీ శ్రీనివాస్..!!
పీసీసీ మాజీ చీఫ్.. సీనియర్ కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ బిడ్డ సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య నాడు వైఎస్ తో సంబంధాల నుంచి తెలంగాణ రాజకీయాల వరకు ఆసక్తి కర చర్చ సాగింది. తనకు వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని డీఎస్ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ పైన తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ అదే అభిమానం ఉందని డీఎస్ వ్యాఖ్యానించారు.
సరైన సమయంలో తెలంగాణ ప్రజలు సరైన రీతిలో స్పందింస్తారని.. వారి స్పందన బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను 2003 లోనే వైఎస్సార్ సీఎం అవుతారని చెప్పానని.. ఇప్పుడు తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానంటూ షర్మిల సైతం సీఎం అవుతారని జోస్యం చెప్పారు. భవిష్యత్ లో వైఎస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి తప్పక అవుతుందంటూ డీఎస్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల.బాధితులకు మెరుగైన ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇక, ఈ రోజు తన తండ్రితో కలిసి నాడు పీసీసీ చీఫ్ గా పని చేయటంతో పాటుగా.. వైఎస్సార్ కేబినెట్ లో కీలక శాఖలు నిర్వహించిన డీఎస్ ను పరామర్శించారు.

మర్యాద పూర్వంగానే డీఎస్ ను కలిసినట్లుగా షర్మిల వెల్లడించారు. డీఎస్ సైతం వైఎస్సార్ కుమార్తె రావటం పట్ల సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా, డీఎస్ కుమారులు ఇద్దరు ఒకరు బీజేపీ ఎంపీ కాగా, మరొకరు కాంగ్రెస్ లో ఉన్నారు. గత మార్చి వరకు డీఎస్ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్...బీజేపీ ఎమ్మెల్యే ఈటల సైతం గతంలో ఆయన్ను కలిసారు. కానీ, డీఎస్ ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications