కారు బీభత్సం, ముగ్గురికి గాయాలు: పోలీస్ స్టేషన్‌లో నిర్మాత సురేష్ బాబుపై కేసు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. ఆయన కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ మేరకు కార్ఖాన పోలీస్ స్టేషన్‌లో సురేష్ బాబు పైన కేసు నమోదు చేశారు. 41ఏ కింద అతనికి నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సురేష్ బాబు కారు వెళ్తుండగా ఆయన కారు టైర్ పంచర్ అయింది. దీంతో కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఈ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న మూడేళ్ల చిన్నారికి, దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారికి గాయాలు తీవ్రంగానే అయ్యాయని తెలుస్తోంది.

కార్ఖాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తుండగా దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన కారు బైక్‌ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 337 కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల బాబు పేరు సిద్ధేష్. అతని తండ్రి సురేష్ చంద్రకు కాలు విరిగిందని తెలుస్తోంది. ఆయన భార్య దుర్గాదేవికి కూడా స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఆమెను డిశ్చార్జ్ చేశారు.












Click it and Unblock the Notifications