ముద్రగడ దీక్షకు దాసరి మద్దతు, బాబుపై ఆగ్రహం: అందరూ ఏకమౌతున్నారు!
హైదరాబాద్: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు దర్శకరత్న దాసరి నారాయణ శుక్రవారం నాడు తన సంఘీభాం తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.
ముద్రగడ నివాసానికి ఎవరూ రాకుండా పోలీసులను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ చర్య ముమ్మాటికి పౌర హక్కుల ఉల్లంఘనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడికి కాపులు రావొద్దన్న నిబంధనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు.

ముద్రగడ వెనుక జగన్.. జగన్‌కు దాసరి అండ
ముద్రగడ పద్మనాభం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ముద్రగడకు వైసిపి భేషరతు మద్దతు ప్రకటించింది. ఇప్పుడు దాసరి కూడా సంఘీభావం తెలపడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితం జగన్.. దర్శకరత్న దాసరి ఇంటికి వెళ్లారు. తన పార్టీలో చేరాలని ఆయన కోరారు. అయితే ఆయన ఆలోచించుకుంటానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దాసరి మాత్రం ఆ రోజు జగన్ పైన ప్రశంసలు కురిపించారు.
ముద్రగడ దీక్ష చేయడం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలకడం, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి కూడా కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దాసరి మద్దతు తెలుపుతున్నారు. తద్వారా చంద్రబాబు పైన కాపులు అందరూ ఒక్కటవుతున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications