Dubai: పాకిస్థానీ చేతిలో ఇద్దరు తెలంగాణ వాసుల హత్య.. సీఎం రేవంత్ చొరవతో..
దుబాయ్‌లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృత దేహాలను త్వరగా భారత్‌కు తరలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌కు, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. మృతుల కుటుంబసభ్యులకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్‌ల శవ పేటికల రవాణాకు ప్రభుత్వం ఉచిత అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ, అంబాసిడర్ డా. బీఎం వినోద్ కుమార్, ఐఎఫ్ఎస్ (రిటైర్డ్) వెల్లడించారు.

తెలంగాణ వాసులను హత్య చేసింది పాకిస్తాన్ యువకులు
బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన స్వర్గం శ్రీనివాస్, అష్టపు ప్రేమ్ సాగర్‌లను పాకిస్థాన్ దేశానికి చెందిన యువకులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లోని ఓ బేకరీలో పాక్ యువకులతో కలిసి వీరు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం పాకిస్థాన్ కు చెందిన యువకుడు మతపరమైన నినాదాలు చేస్తూ.. కత్తితో భారతీయులపై దాడికి దిగాడు.
ఈ దాడిలో శ్రీనివసా్, ప్రేమ్ సాగర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ ల మృతితో వారి వారి కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ మృతదేహాలు స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు సహకరించాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. మరోవైపు, ప్రేమ్ సాగర్ కుటుంబసభ్యులను కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications