అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్టు
నిర్మల్ జిల్లాలో దారి దోపీడీలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకొని రెండు వాహనాలు, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్: నిర్మల్ జిల్లాలో దారి దోపీడీలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకొని రెండు వాహనాలు, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం నిజామాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆనంద్‌కుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. నాందేడ్ జిల్లాకు చెందిన ఇమ్రాన్, అన్వర్‌ఖాన్, తయ్యబ్, రఫీక్, మస్తాన్, అమీర్ అనే ఆరుగురు ఓ దొంగల ముఠాగా ఏర్పడ్డారు.
ఈ ముఠాకు ఇమ్రాన్ నాయకత్వం వహిస్తున్నారు. వీరంతా కలిసి తొలుత సెప్టెంబరు 22న నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ పోలీసు స్టేషను పరిధిలోని ఫకీరాబాద్-యంచ మధ్యలో ఓ దారి దోపిడీకి పాల్పడ్డారు.
క్కజొన్న లోడుతో వెళ్తున్న గుజరాత్‌కు చెందిన లారీని అడ్డగించి డ్రైవర్లు, క్లీనర్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం వారి నుంచి రూ.24 వేల నగదు, చరవాణిలు అపహరించుకెళ్లారు. తిరిగి అక్కడి నుంచి బోధన్, రుద్రూర్, వర్ని, బాన్సువాడ మీదుగా మల్లారం అటవీ ప్రాంతంలో బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాను అడ్డగించి వారి నుంచి రూ.4 వేల నగదుతో పాటు చరవాణిలు దోపిడీ చేశారు.

అనంతరం 26న రాత్రి నిర్మల్ జిల్లా ముథోల్‌లో మరో దోపిడీకి పాల్పడ్డారు. ఓ లారీని అడ్డగించి రూ.లక్ష దోపిడీ చేసి ఉడాయించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఉభయ జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నార్త్ రూరల్, రుద్రూర్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.
గతంలో దోపిడీలకు పాల్పడిన ముఠాలపై అనుమానం వచ్చి నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ బుచ్చయ్య ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నాందేడ్‌కు చెందిన ఇమ్రాన్ ముఠా పనేనని ఆధారాలు లభించాయి.
లోతుగా దర్యాప్తు చేయటంతో సదరు ముఠా పోలీసులకు చిక్కింది. దీంతో ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు బొలేరో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 23 వేల నగదుతో పాటు చరవాణిలు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండుకి పంపారు.
నంబరు ప్లేట్లు మారుస్తూ..
ఈ ముఠా గత నెల రోజులుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో వరుస దారిదోపిడీలకు పాల్పడుతోంది. అయితే దోపిడీకి పాల్పడిన ప్రతీసారి బొలేరో వాహనాలు ఉపయోగించారు.
తెలుపు, నీలి రంగు గల రెండు బొలేరో వాహనాలను దోపిడీ సమయంలో వాడారు. ఈ వాహనాలు వాడిన ప్రతీసారి తప్పుడు నంబర్లు ప్లేట్లు వినియోగించారు.
ఒకసారి దొంగతనం చేసిన తర్వాత తిరిగి కొత్తగా నంబరు ప్లేట్లు మార్చుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఠా నాయకుడిగా ఉన్న ఇమ్రాన్‌పై గతంలో మహారాష్ట్రలోను దారి దోపిడీ కేసులు ఉన్నాయి.
రెండు జిల్లాల పోలీసులు గాలింపు
దారి దోపిడీల నేపథ్యంలో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. వీరితో పాటు మహారాష్ట్ర పోలీసులు వీరికోసం గతం నుంచి గాలిస్తున్నారు. తాజాగా మల్లారం వద్ద జరిగిన దారి దోపిడీ ఆధారంగా నార్త్ రూరల్ సీఐ బుచ్చయ్య ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు ముందుకు సాగించగా ఎట్టకేలకు ముఠా పోలీసులకు పట్టుబడింది.
అభినందించిన ఏసీపీ
అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠాను పట్టుకోవటంలో క్రియాశీలకంగా పనిచేసిన పోలీసులను ఏసీపీ ఆనంద్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. చిన్నపాటి ఆధారాల సాయంతో ముఠాను పట్టుకోవటం గొప్ప విషయమన్నారు. ఈ విషయమై నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ బుచ్చయ్య, ఎస్సై ఉపేందర్‌రెడ్డి, సిబ్బంది నర్సయ్య, వేణుగోపాల్, శేఖర్‌బాబు, పీర్‌చంద్, మనోహర్, సందీప్, శ్రీనివాస్‌లను ప్రత్యేకంగా అభినందించారు. వీరికి త్వరలోనే రివార్డు అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications