ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమన్నారంటే?
ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తోపాటు ఇతర అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.
2014కు ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఉన్న చెరువులు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామని డిప్యటీ సీఎం భట్టి చెప్పారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ సిటీ అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని చెప్పారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని డిప్యటీ సీఎం విక్రమార్క తెలిపారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని.. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకొంటున్నారని డిప్యూటీ సీఎం విక్రమార్క వివరించారు.
రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫొటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి.. ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయనేది ప్రజల ముందు పెడతామని చెప్పారు డిప్యటీ సీఎం భట్టి. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామననారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని, ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాగా, శనివారం ఉదయం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. తమ్మిడి చెరువును ఆక్రమించి కట్టడంతోనే కూల్చివేశామని హైడ్రా ఇప్పటికే స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications