వేములవాడకు పోటెత్తిన భక్తులు: దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!!
వేములవాడలోని రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండడంతో పాటు వరుస సెలవులు రావడంతో వేములవాడకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తరలివస్తున్నారు. దీంతో వేములవాడ జనసంద్రంగా మారింది.
వేములవాడలో భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వ ర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొలుత ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మ గుండంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరా జేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వేములవాడకు తరలి రావటంతో కళ్యాణ కట్ట వద్ద కూడా బాగా బిజీ నెలకొంది.

భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు కళాభవన్ లో స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొంటున్నారు.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు. అనుబంధాలయమైన బద్ధి పోచమ్మ దేవాలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకుంటున్నారు. భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో అందుకు తగ్గట్టు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ ఈవో డి.కృష్ణ ప్రసాద్ ఆలయ సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆలయంలో స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులు రద్దీ నేపధ్యంలో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications