పిల్లల పేరుతో వచ్చే పార్సిల్స్ లో డ్రగ్స్; తల్లిదండ్రులకు షాకింగ్ విషయం చెప్పిన పోలీసులు
తెలంగాణ రాష్ట్రంలో చాప కింద నీరులా డ్రగ్స్ విస్తరిస్తోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 600 మంది యువత డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ వెల్లడించారు. మూడు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సి పి ఆనంద్ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
Recommended Video

పిల్లల పేరుతో ఇళ్ళకు వచ్చే పార్సిల్స్ తల్లిదండ్రులే ఓపెన్ చెయ్యాలన్న సీపీ ఆనంద్
రాష్ట్రంలోని చాలామంది యువత, ఉద్యోగులు డ్రగ్స్ బారిన పడినట్టు పేర్కొన్న ఆయన పిల్లల పేరుతో ఇళ్లకు వచ్చే కొరియర్స్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల పేరుతో ఏదైనా పార్సిల్ వస్తే కచ్చితంగా తల్లిదండ్రులే వాటిని ఓపెన్ చెయ్యాలని, వాటిలో ఏముందో చెక్ చేసిన తర్వాతనే పిల్లలకు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే అమెజాన్ వంటి సంస్థల ద్వారా కూడా డ్రగ్స్ ఆర్డర్స్ వస్తున్నాయని పోలీసులు తెలియజేశారు.

డార్క్ వెబ్ లో డ్రగ్స్ కొనుగోళ్ళు .. క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు
ఇక చాలామంది డ్రగ్స్ వినియోగదారులు, డ్రగ్స్ పెడ్లర్లు క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని, డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, డ్రగ్స్ అమ్మే వాళ్లను, వినియోగదారులను అరెస్టు చేశామని హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇప్పటివరకు పట్టుబడిన నిందితులు అందరూ ఉన్నత చదువులు చదువుకున్న వారేనని, చాలా మంది సంపన్న కుటుంబాలకు చెందిన వారని పేర్కొన్న ఆయన డార్క్ వెబ్ లో ఎంటర్ అయిన తరువాత అందులో వికర్ మీ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరాను ఆపరేట్ చేస్తున్నారని వెల్లడించారు.

ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా డ్రగ్స్ కొనుగోళ్ళు .. ప్రధాన సూత్రధారిని గుర్తించామన్న సీపీ
ఇందులో ముఖ్యంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారని, వారి వివరాలు చెబితే తల్లిదండ్రులు షాక్ అవుతారు అని వెల్లడించడం లేదని తెలిపారు. చాలామంది డ్రగ్స్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసినట్లుగా గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు పట్టుకున్న వారి ఐడీలను పెట్టి వీటిని ఆపరేట్ చేస్తున్నామని, నరేంద్ర ఆర్య అనే వ్యక్తిని డ్రగ్స్ ముఠా లో ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సిపి సివి ఆనంద్ తెలిపారు.

డ్రగ్స్ కేసులో 8మందిని పట్టుకున్నామన్న సీపీ సీవీ ఆనంద్
ఇప్పటి వరకూ అతను 30 లక్షల రూపాయలు విలువగల డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లు గుర్తించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. మొత్తం 450 మంది వినియోగదారులు నరేంద్ర ఆర్య దగ్గర్నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించామన్నారు. హైదరాబాద్లో ఆరుగురిని గుర్తించామని, నిందితుల వద్ద నుండి 39 లక్షల విలువగల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, మొత్తం ఈ కేసులో ఎనిమిది మందిని పట్టుకున్నామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.












Click it and Unblock the Notifications