dubbaka telangana congress trs raghunandan rao cm kcr harish rao దుబ్బాక తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ హరీశ్ రావు politics
దుబ్బాక వార్ : ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ కీలక నేత... టికెట్ దక్కనందుకే...?
దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఉపఎన్నికలో గెలిచి తమ పట్టు ఏమాత్రం సడలలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా... అధికార పార్టీని ఎలాగైనా ఓడించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ కీలక నేత,మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

టికెట్ దక్కుతుందన్న ధీమా... కానీ...
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఇప్పటివరకూ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. సోలిపేట కుటుంబానికే టికెట్ ఇవ్వాలా... లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అన్న దానిపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. ఈ చర్చలు ఇలా కొనసాగుతుండగానే దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులను సమీకరించుకుని గ్రామాల్లో పర్యటిస్తూ వచ్చిన ఆయన... సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వవద్దని పట్టుబడుతున్నారు.ఈసారి ఎలాగైనా తనకే టికెట్ దక్కుతుందన్న ధీమా క్షేత్ర స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే..

సోలిపేట కుటుంబానికే టికెట్...
దుబ్బాక ఉపఎన్నిక టికెట్‌ను సోలిపేట కుటుంబానికే ఇచ్చే యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామలింగారెడ్డి కుమారుడిపై పలు విమర్శల నేపథ్యంలో ఆయన సతీమణికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్‌లో తనకు టికెట్ దక్కదని భావిస్తున్న శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సోమవారమే(అక్టోబర్ 5) టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీతో గ్యాప్... మళ్లీ యాక్టివ్...
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరుపున టికెట్ ఆశించి భంగపడ్డ చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డితో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ సమయంలో శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంత కాలానికి ముత్యం రెడ్డి కన్నుమూయడంతో పార్టీకి,శ్రీనివాసరెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది. ఇదే క్రమంలో సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక ఉపఎన్నిక అనివార్యమవడంతో శ్రీనివాసరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ తరుపున బరిలోకి...?
దుబ్బాకలో ఎవరిని బరిలో దింపాలా అన్న డైలామాలో కాంగ్రెస్ ఉంది. తూంకుంట నర్సారెడ్డి, కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు శ్రీనివాసరెడ్డి సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లు రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా లేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఎంత మేర ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి.