కేసీఆర్‌కు డబుల్ షాక్: నల్గొండ కీలక నేత దుబ్బాక రాజీనామా, కాంగ్రెస్‌లోకి ఖమ్మం ఉషారాణి
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు గట్టి షాక్ తగిలింది. పార్టీలోని కీలక సీనియర్ నేత, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దుబ్బాక నర్సింహ రెడ్డి తెరాసకు, ఆ పార్టీలోని పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించారు.
ఆయన నల్గొండ అసెంబ్లీ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. తనకు నల్గొండ టిక్కెట్ ఇవ్వలేదని, అది కాకుంటే నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ఏదీ ఇవ్వలేదని దుబ్బాక అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు నల్గొండ నియోజకవర్గంతో పాటు నకిరేకల్‌లో మంచి బలం ఉంది.

కాంగ్రెస్ పార్టీలోకి దుబ్బాక నర్సింహా రెడ్డి
దుబ్బాక నర్సింహా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. దుబ్బాక నర్సింహా రెడ్డి అనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉంది. అందులో నల్గొండ జిల్లా మరీ ముఖ్యమైనది. అలాంటి కాంగ్రెస్‌కు బలం ఉన్న జిల్లాలోనే తెరాసకు షాక్ తగలడం ఆ పార్టీకి భారీ దెబ్బ.

రాజీనామా కలకలం
దుబ్బాక నర్సింహా రెడ్డి త్వరలో తన అనుచరులతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల్లో బలం ఉన్న అతను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. నాలుగు రోజుల ముందు ఆయన రాజీనామా నల్గొండ జిల్లాలో కలకలం రేపుతోంది.

ఖమ్మం జిల్లా మధిరలోను ఎదురుదెబ్బ
నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలోని తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. మధిర నియోజకవర్గంలో తెరాస మధిర పట్టణ అధ్యక్షురాలు గూడెల్లి ఉషారాణి తెరాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మధిరను ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని ఈ సందర్భంగా మల్లుభట్టి ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు అనుబంధంగా ఎర్రబాలెంలో డ్రైపోర్టును ఏర్పాటు చేస్తామన్నారు.

వరుస రాజీనామాలతో తెరాసకు దెబ్బ
తెరాసకు మొదటి నుంచి ఉత్తర తెలంగాణలో గట్టిపట్టు ఉంది. గత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోను దక్షిణ తెలంగాణలో ఆశించిన మేర సీట్లు సాధించలేదు. దీంతో దక్షిణ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఉవ్వీళ్లూరుతోంది. కానీ ఇటీవల పలు జిల్లాల్లో తెరాస నుంచి పలువురు నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీలలోకి వెళ్తున్నారు. నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ బలం ఎక్కువ. దానికి తోడు ఇప్పుడు సీనియర్ నేతలు రాజీనామా చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications