జీ కిషన్ రెడ్డి నియామకం పట్ల ఈటల రియాక్షన్- మా మధ్య గ్యాప్ లేదంటూ
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టింది బీజేపీ అధిష్ఠానం. రెండు చోట్లా పార్టీ అధ్యక్షులను తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి- ఏపీలో పార్టీ పగ్గాలను కేంద్ర మాజీమంత్రి డీ పురంధేశ్వరికి అప్పగించింది.
అదే సమయంలో తెలంగాణలో.. మాజీ మంత్రి, హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్‌కు కీలక పదవిని అప్పజెప్పింది బీజేపీ అధిష్ఠానం. పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. జాతీయ స్థాయిలో పని చేసే కమిటీ ఇది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఈటల పర్యవేక్షిస్తారు.

ఈ మార్పులపై ఈటల రాజేందర్ స్పందించారు. పార్టీ కోసం నిబద్దతతో పని చేసే వారికే ప్రాధాన్యత దక్కుతుందని తేల్చి చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అధికారంలోకి రావడం అనేది సమష్ఠి బాధ్యతగా గుర్తించాలని, అందరం కలిసి పనిచేస్తామని అన్నారు.
గ్రూప్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని ఈటల స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాలు కొట్టిన పిండేనని, పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ఎలాంటి వ్యూహాలను రూపొందించాలనే విషయంపై ఆయనకు మంచి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల్లో మార్పులు చేర్పులు అనేవి అత్యంత సహజమని ఈటల వ్యాఖ్యానించారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏ పార్టీలోనైనా ఇలాంటి మార్పులు చేర్పులు సహజమేనని అన్నారు. అధిష్ఠానం- రాష్ట్ర నేతలు సమన్వయంతో పని చేసి, తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయాలనే లక్ష్యాన్ని సాధిస్తాయని , అధికారంలోకి రావాలనే సంకల్పం తమలో ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications