వచ్చే ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియం బోధన; మనఊరు-మనబడి పైలాన్ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్
వనపర్తి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు-మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మన ఊరు - మన బడి పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. మన ఊరు మన బడి పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం
మన ఊరు మన బడి కార్యక్రమం రాష్ట్రంలో విద్యా రంగాన్ని పటిష్టం చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కేంద్రంగా శ్రీకారం చుట్టామని కెసిఆర్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ కోరారు.
విద్యార్థులంతా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్న కేసీఆర్
తామందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని కెసిఆర్ వెల్లడించారు. మీ ముందు ఈ హోదాలో ఈరోజు నిలబడ్డామంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోజు గురువులు చెప్పిన విద్యనే కారణమని కెసిఆర్ తమకు విద్యను బోధించిన గురువులను కొనియాడారు. చక్కని వసతులతో భవిష్యత్తులో పాఠశాలల నిర్మాణం జరగబోతోందని, విద్యార్థులంతా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ప్రారంభం, మన ఊరు- మన బడి పైలాన్ ఆవిష్కరణ
సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చిట్యాల లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ను ప్రారంభించిన కెసిఆర్ ఆ తర్వాత, వనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు- మన బడి పైలాన్ ను ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత నాగవరం లోని టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
Recommended Video
రోజంతా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ
ఆపై వనపర్తి కలెక్టరేట్ ను ప్రారంభించి ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మెడికల్ కళాశాలకు చేసి వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడతారు. ఇలా రోజంతా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన కొనసాగనుంది.












Click it and Unblock the Notifications