బాబుపై తొలిసారి ఎర్రబెల్లి: ‘కెసిఆర్‌లో వైయస్ ఆత్మ, జగన్‌తో చీకటి ఒప్పందం’
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత తొలిసారి టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు చేశారు.
నీటి విషయంలో చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నీటి వాటాను అడ్డుకునే యత్నాలు చేయవద్దని కోరారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కె చంద్రశేఖర్ రావు ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారని అన్నారు.
తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతు తెలపాలనే తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చానని ఇటీవలే పార్టీ మారిన ఎర్రబెల్లి అన్నారు.

వైయస్ ఆత్మ కేసీఆర్‌లో.. చీకటి ఒప్పందంలో భాగమే జగన్ దీక్ష: రేవంత్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ ఆత్మ సీఎం కేసీఆర్‌ను ఆవహించిందని.. అందుకే ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ చేస్తోన్న అక్రమాలపై తాము మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామని టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ధర్నా చేస్తానని ప్రకటించిన అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్, వైయస్సార్ కాంగ్రెస్ చీకటి ఒప్పందంలో భాగమే జగన్ దీక్ష అని విమర్శించారు.
చంద్రబాబుపై జగన్ చేసే ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ అన్నారు.
ఏపీ వైయస్సార్ కాంగ్రెస్ నేతలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీకి రూ.10వేల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చింది వాస్తవం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. వైయస్ జగన్.. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు తీసుకున్న కాంట్రాక్టులను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications