ఛీకొట్టించుకుంటున్నారు: రేవంత్ సర్కారుపై ఈటల రాజేందర్ నిప్పులు
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు దాడికి దిగారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. అతి తక్కువ కాలంలోనే ప్రజలతో ఛీకొట్టించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారేనని అన్నారు. ఆచరణ కాని హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ నేతలను మించినవారు లేరని మండిపడ్డారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే పార్టీ బీజేపీ మాత్రమేనని ఈటల వ్యాఖ్యానించారు.
అంతేగాక, కాంగ్రెస్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లు వేయించాలని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు ఫోన్లు చేసి మంత్రులు హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు.గ్రాడ్యుయేషన్ ఓట్లు అడిగే ముందు నిరుద్యోగులకు రూ.4వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 4వేల రూపాయలు క్లియర్ చేస్తేనే వారిని ఓట్లు అడగాలన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పార్టీ బీజేపీ. 310 జీవోపై గతంలో కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. ఇప్పుడు ఆ జీవోపై ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంతవరకు ఆర్టీసీ కార్మికులకు అపాయింట్ మెంట్లు ఇవ్వలేదు. ఎప్పటివరకు ఆర్టీసీ కార్మికులకు అపాయింట్ మెంట్లు ఇస్తారు? మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటివరకు చెల్లిస్తారు? ఆర్టీసీని పాత పద్ధతిలో దివాళా తీసే స్థితికి తీసుకొస్తున్నారని రేవంత్ సర్కారుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికులు అందరికీ ఒకేసారి జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు ఈటల రాజేందర్. గతంలో నిరుద్యోగ భృతి విషయంలో కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా నిరుద్యోగులను మోసం చేస్తోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 4 డీఏలు రిలీజ్ చేసిందని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ విషయంలో ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఇంతవరకు డీఏ ఊసే లేదని ఈటల మండిపడ్డారు. ఓట్లు అడిగే ముందు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డీఏలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలి. 2023 జూలై 1 కొత్త పీఆర్సీ అమలు కావాలి. కానీ, ఇంతవరకు అతీగతి లేదని కాంగ్రెస్ సర్కారుపై ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications