తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?: అమిత్ షా ఫోన్
దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. నరేంద్ర మోడీ కేబినెట్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి స్థానం లభించింది. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని నియమించే పనిలో పడింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపురావడం గమనార్హం. దీంతో రేపు(సోమవారం) పార్టీ అగ్రనేత అమిత్ షాను కలవనున్నారు ఈటల రాజేందర్. కేంద్ర క్యాబినెట్లో చోటు కోసం తెలంగాణ నుంచి దాదాపు గెలిచిన ఎంపీలంతా ఆశలు పెట్టుకున్నారు.

అయితే కిషన్ రెడ్డి తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు మాత్రమే నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో చోటు దక్కింది. దీంతో ఈటల రాజేందర్ ఒకింత అసంతృప్తి చెందారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా నుంచి ఆయనకు ఫోన్ కాల్ వెళ్లింది.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను కలవాలని ఈటల రాజేందర్‌కు సూచించినట్లు సమాచారం. దీంతో కాసేపటి క్రితం ఈటల రాజేందర్ అసోం సీఎం హిమంతను కలిశారు. కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ విషయమై హిమంతతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక, సోమవారం అమిత్ షాను ఈటల రాజేందర్ కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ అధ్యక్ష బాధ్యతల అప్పగింతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలతో మంచి అటాచ్‌మెంట్ ఉండటం, మాస్ లీడర్‌గా పేరుండటంతో ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications