కేసీఆర్ కు ఈటల రాజేందర్ సవాల్: అది నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!!
కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, బీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేస్తుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటల రాజేందర్ నేడు వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిల్లా వరంగల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని నిరూపిస్తారా? :ఈటల రాజేందర్
రైతులకు 24 గంటలు కరెంటు వస్తుందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని, ధరణి పోర్టల్ ద్వారా, భూముల అక్రమాలకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తామని చెప్పిన డబల్ బెడ్రూమ్స్ ఇప్పటివరకు కట్టివ్వలేదని కనీసం ఇళ్ల జాగాలు కూడా ఇవ్వలేదని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

బీజేపీ పభుత్వం వస్తే పించన్లు పోతాయని తప్పుడు ప్రచారం
బిజెపి ప్రభుత్వం వస్తే పింఛన్లు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే పింఛన్లు ఎక్కడికి పోవాలి ఇంకా పింఛన్లను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం పోతేనే తెలంగాణ పిల్లల బతుకులు బాగుపడతాయని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు ధరణి పోర్టల్ కారణంగా అవస్థలు పడుతున్నారన్నారు. అంతేకాదు కెసిఆర్ సర్కార్ రైతుబంధు పేరుతో డబ్బులు ఇచ్చి ధాన్యం తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటుందని ఆరోపించారు.

తెలంగాణా రికార్డులు అందులోనే
దేశంలోనే ఎక్కువ మద్యం తాగే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డులు సాధించిందని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను అరిగోస పెడుతోందని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రానికి అరిష్టమని ఆయన విరుచుకుపడ్డారు.

ఏసీడీ ఛార్జీల పేరుతో కరెంట్ బిల్లుల నిలువుదోపిడీ
బిఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. మహిళలను, అణగారిన వర్గాలను అవమానాలకు గురి చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్ చెబుతున్నారని, ఏ రాష్ట్రానికి లేని లిక్కర్ ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని ఈటల పేర్కొన్నారు. ఏసీడీ ఛార్జీల పేరుతో రైతుల నుండి కూడా అదనపు కరెంటు బిల్లులను వసూలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు .












Click it and Unblock the Notifications