హుజూరాబాద్‌లో నా గెలుపు ఆపలేరు: కేసీఆర్, హరీశ్ రావుకు ఈటల రాజేందర్ సవాల్
హుజూరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని కేసీఆర్, హరీశ్ రావుకు సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో ఆయన ఆదివారం పర్యటించారు.

కేసీఆర్, హరీశ్ రావులకు ఈటల రాజేందర్ సవాల్
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పలువురు బీజేపీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 'నన్ను ఓడించేందుకు 5 వేల కోట్లయినా ఖర్చు చేస్తారట.. బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్. ? నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను.. హరీశ్ రావు.. వస్తవా.. రా.. ఇక్కడ పోటీ చేద్దాం.. కేసీఆర్.. నా మీద పోటీ చెయ్..' అంటూ సవాల్ విసిరారు.

హుజూరాబాద్‌లో తన గెలుపును ఆపలేరంటూ ఈటల
దళితబంధు ద్వారా రూ. 10 లక్షలు ఇచ్చినా టీఆర్ఎస్ గెలవదు. గొర్రెలిచ్చినా, కులాలవారీగా తాయిలాలిచ్చినా టీఆర్ఎస్‌కు ప్రజలు ఓట్లు వేయరు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడ్డా.. నా గెలుపును ఆపలేరని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల మీద తప్ప ఎస్సీలపై కేసీఆర్‌కు ప్రేమ లేదని అన్నారు. టీఆర్ఎస్ ఏమీచ్చినా తీసుకోండి.. బీజేపీకే ఓటేయండి అని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాపాడుకుంటారో.. చంపుకుంటారో మీ ఇష్టమంటూ ఈటల
ప్రజల ఓట్లతో వచ్చిన పదవులతో వాళ్లకే ద్రోహం చేస్తూ.. చూస్తూ ఊరుకోరని.. కర్రు కాల్చి వాతపెడతారని మజీ మంత్రి ఈటల హెచ్చరించారు. 'గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు..? వాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే... నన్ను కాపాడుకుంటరా.. చంపుకుంటరా మీ ఇష్టం.. ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Recommended Video

కేసీఆర్ ఏమిచ్చినా తీసుకోండి.. పువ్వు గుర్తుకే ఓటేయ్యండి..
హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదు.. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్..' అని మాజీ మంత్రి ఈటల దుయ్యబట్టారు. ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతయని, ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే నామీద కేసీఆర్ కోపం పెంచుకున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు. ఆ సొమ్మంతా మీదే తీసుకోండి. తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు... అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి.. ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఆయన కోరారు. గతంలో తాను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు గెలిచారనే విషయం మరవొద్దని ఈటల రాజేందర్ సూచించారు.












Click it and Unblock the Notifications