బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ చేసిన ఈటల రాజేందర్.. హాట్ డిబేట్!!
ఈటల వ్యవహారం బీజేపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ గా ఇతర పార్టీల నుండి బీజేపీలోకి నేతలను చేర్చుకునే కీలక బాధ్యత చేపట్టారు. అయితే చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ఫెయిల్ అయ్యారు. ఇతర పార్టీల నుండి కీలక నాయకులను చేర్చుకోలేకపోయారు.
అది పక్కన పెడితే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం కాస్త విఫలం అయ్యింది. ఇక ఇదే విషయాన్ని ఈటల మీడియా ముఖంగా వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, జూపల్లి కృష్ణారావు ని పార్టీలోకి చేరమని మంతనాలు జరిపిన ఈటల రాజేందర్ వారిద్దరూ బీజేపీలో చేరకపోవచ్చని ప్రకటించడం, బిజెపిలో చేరడానికి వారికి ఏవో ఇబ్బందులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేయడం చేశారు.

అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ చేరే అవకాశం ఉందని చెప్పడం బిజెపినేతలకు తలనొప్పి తెప్పించింది. ఇక వారు తనను కూడా తమతో కలిసి రమ్మన్నారని వ్యాఖ్యలు చేయటం కూడా షాకింగ్ అనే చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారు అన్న విషయం పక్కనపెడితే వారిద్దరి చేరికపై ఈటల వ్యాఖ్యలు చేయడం, వారు బిజెపిలో చేరడం లేదని చెప్పడం బిజెపి ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.
అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందని వ్యాఖ్యలు చేయడం కూడా బిజెపికి తలనొప్పిగా మారింది. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలకు ఆయుధాలు అయ్యాయి. ఏకంగా మంత్రి హరీష్ రావు ఈటల రాజేందర్ ఇక చేతులెత్తేశారు. బిజెపిలో ఎటువంటి చేరికలు ఉండబోవని చెప్పడం బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కూడా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసినట్టు గానే ఉన్నాయి. ఏదిఏమైనా ఈటల రాజేందర్ ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి, చేరికల కమిటీకి చైర్మన్ గా ఉండి, ఈ తరహా వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం చేయడాన్ని బీజేపీ నేతలు సీరియస్ గానే తీసుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంలో బీజేపీ హైకమాండ్ ఏం చేస్తుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications