ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. ఏజెన్సీలలో హైఅలెర్ట్!!
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 5 గంటలకు రాజకీయ నాయకులు ప్రచారాన్ని ఆపివేయనున్నారు. వారి మైకులు మూతపడనున్నాయి. నేటితో ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధికారులు చేశారు.
సెంట్రల్ ఫోర్స్ కూడా తెలంగాణలో రంగంలోకి దిగి ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు లక్ష మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్ర పోలీసులు మాత్రమే కాకుండా కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగి ఎన్నికలు సజావుగా జరిగేందుకు విధులను నిర్వర్తిస్తున్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలోనూ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మొహరించిన ఎన్నికలసరళిని పర్యవేక్షిస్తున్నాయి.

తెలంగాణా ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం 4400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల విధులలో 65 వేలమంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18 వేల మంది హోంగార్డులు కూడా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే పోలీసులు మరింత గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అవాంచిత సంఘటనలు జరగకుండా భద్రతను మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
చత్తీస్ గడ్ తరహాలో మావోలు రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్‌గా భారీ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మావోల కోసం పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. ఇక రేపు సాయంత్రం నుండి పోలింగ్ ముగిసేవరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది.












Click it and Unblock the Notifications