సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు కొత్త ఈ రెండు స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం
Vande Bharat express: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు. ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతోంది.

సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు లభిస్తోన్న ప్రజాదరణ, డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. మరో రెండు స్టేషన్లల్లో ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపారు. ఉత్తర్వులను జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు.
- ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ కొత్తగా సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల్ స్టేషన్లల్లో హాల్ట్ అవుతుంది. నాగ్ పూర్ నుంచి తెల్లవారు జామున 5 గంటలకు బయలుదేరే నంబర్ 20101 వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 12:15 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
- మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 20102 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రాత్రి 8 గంటలకు నాగ్ పూర్ కు చేరుకుంటుంది.
సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, ఖాజీపేట్ లల్లో ప్రస్తుతం ఈ రైలు హాల్ట్ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. కొత్తగా మరో రెండు స్టేషన్లు సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల్ ఈ జాబితాలో చేరనున్నాయి. దీనికి సంబంధించిన తేదీలపై రైల్వే అధికారులు కసరత్తు చేస్తోన్నట్లు జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ హాల్ట్ సౌకర్యం వల్ల రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఎంతగానో లబ్ది కలుగుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications