దేవుడు పిలుస్తున్నాడని.. కుటుంబం అంతా ఆత్మహత్య !!
హైదరాబాద్ లో హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆరు నెలల క్రితం పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోగా.. ఆ బాధ నుంచి కోలుకోలేక ఆ కుటుంబంలో మిగిలిన ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ (45), ఆయన భార్య విజయలక్ష్మి (42) దంపతులు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు - కావ్య, శ్రావ్య (16). అయితే ఆరు నెలల క్రితం పెద్ద కుమార్తె కావ్య ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. ఈ ఘటన తరువాత మానసికంగా పూర్తిగా కుంగిపోయిన కుటుంబం రాంనగర్ నుంచి అంబర్‌పేట రామకృష్ణానగర్‌లోని అద్దె ఇంటికి నెల రోజుల క్రితం మాత్రమే మారింది. కానీ ఆ మానసిక ఆవేదన, ఒంటరితనం వారికి వెంటాడుతూనే ఉంది.

ఇక అప్పటి నుంచి వారంతా ఎవరితోనూ మాట్లాడకుండా బంధువులకు సైతం దూరంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క సువర్ణ తమ్ముడిని చూడటానికి వచ్చి.. ఎంత పిలిచినా తలుపు తీయలేదని వాపోయారు. అంతే కాకుండా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు స్పష్టం చేశారు. దాంతో కాచిగూడ ఏసీపీ హరీశ్‌కుమార్, డీఐ హఫీజుద్దీన్, ఎస్సై సురేశ్‌లు ఘటనాస్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా అంతా విగతజీవులుగా కనిపించారు.
శ్రీనివాస్ ప్రధాన ద్వారం వెంటిలేటర్‌కు.. భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రావ్య గదిలో కిటికీ ఇనుప చువ్వలకు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారు రెండు రోజుల క్రితమే చనిపోవడంతో మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమను పదేపదే దేవుడు పిలుస్తున్నాడని వారు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రాంతమంతా క్షణాల్లోనే విషాద ఛాయలు అలుముకున్నాయి.
అయితే పెద్ద కుమార్తె మరణం తర్వాత ఆ దంపతులు తీవ్ర మానసిక డిప్రెషన్‌లోకి వెళ్లారని.. పని చేయడంలో కూడా ఇబ్బంది పడుతున్నారనే విషయాలు బయటపడ్డాయి. వీటన్నింటి ఒత్తిడిలో కుటుంబం తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని.. దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒకే కుటుంబ సభ్యులు ఇలా వరుసగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications