న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కాదది.. మన హైదరాబాదే
T20 World Cup 2024 final: టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు అందుకోవడం ఇదే రెండోసారి. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే.
శనివారం రాత్రి బార్బడొస్‌లో జరిగిన ఫైనల్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగలు వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.

ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తరువాత విజృంభించాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ న్యాయం చేశాడు. 31 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47 పరుగులతో రాణించాడు.
178 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా కూడా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కుకున్నారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 58 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. వారిద్దరూ అవుట్ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టనిపించింది గానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డు నిలిచాడు.
27 బంతుల్లోనే అయిదు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు క్లాసెన్. అతను ఉన్నంత సేపూ మ్యాచ్‌పై ఆశల్లేవు. 151 పరుగుల వద్ద క్లాసెన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉండటం కలవరపాటుకు గురి చేసినా చివరి ఓవర్ తొలిబంతికి అతనూ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది.
ఈ మ్యాచ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఆకాశాన్నంటాయి. చివరి బంతి పడిన వెంటనే క్రికెట్ ప్రేమికులు రోడ్డెక్కారు. కార్లు, బైక్‌లు బయటికి తీశారు. వాటికి జాతీయ పతాకాలను అంటించి.. రోడ్లపై కలియదిరిగారు. భారత్ మాతా కీ జై.. అంటూ నినాదాలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు జిందాబాద్‌లు కొట్టారు.

హైదరాబాదీయుల సెలబ్రేషన్స్‌కు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సచివాలయం కేంద్రబిందువు అయ్యాయి. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ మీదుగా వందలాదిమంది సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే బాణాసంచా కాల్చారు. రాకెట్లను నింగిలోకి పంపించారు. ఇండియా జిందాబాద్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
సచివాలయం పరిసర ప్రాంతం మొత్తం అభిమానులతో నిండిపోయింది. అమెరికా వాణిజ్య రాజధానిగా భావించే న్యూయార్క్‌లో గల ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌ను తలపించిందా ప్రదేశం. ఫోకస్ లైట్ల వెలుగులతో నిండిపోయిందదంతా. కొన్ని గంటల పాటు క్రికెట్ ప్రేమికులు అక్కడే గడిపారు. టీమిండియా విజయాన్ని ఆస్వాదించారు.












Click it and Unblock the Notifications