చట్నీ పడిందని ఓ వ్యక్తిని నలుగురు యువకులు హత్య.. కత్తులతో పొడిచి..!
సభ్యసమాజం ఎటు పోతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంటుంది. కేవలం చట్నీ బట్టలపై పడిందనే చిన్న కారణంతో నలుగురు యువకులు ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. అర్థరాత్రి సమయంలో అతనికి కారులో లిఫ్ట్ ఇచ్చి.. ఆ తర్వాత గంటల తరబడి చిత్రహింసలకు గురిచేసి.. చివరకు కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసును రాచకొండ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేయడం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కళ్యాణపురి నివాసి మురళీ కృష్ణ (45) సోమవారం రాత్రి ఎల్బీనగర్ వద్ద ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడిగాడు. ఆ సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తున్న మహమ్మద్ జునైద్ (18), షేక్ సైపుద్దీన్ (18), పొన్నా మణికంఠ (21) ఒక 16 ఏళ్ల బాలుడు ఉన్నారు. అయితే మార్గం మధ్యలో ఉప్పల్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో వారంతా టిఫిన్ చేయడానికి ఆగారు. అక్కడ అనుకోకుండా మురళీ కృష్ణ ప్లేట్‌లోని చట్నీ ఒక యువకుడి బట్టలపై పడింది.

దీంతో ఆగ్రహించిన యువకులు మురళీ కృష్ణతో గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా.. బలవంతంగా అతన్ని తిరిగి కారులోకి ఎక్కించుకున్నారు. తెల్లవారుజాము వరకు సుమారు రెండు గంటల పాటు కారులోనే తిప్పుతూ.. చిత్ర హింసలకు గురి చేసినట్టు తెలిపారు. పిడిగుద్దులుతో కొట్టడం.. సిగరెట్లతో కాల్చడం.. చివరకు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నాచారం పారిశ్రామికవాడలోని తెలంగాణ ఫుడ్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కారులోనే కత్తితో విచక్షణారహితంగా పొడిచారు.
అయితే నిందితుల నుంచి తప్పించుకునేందుకు మురళీ కృష్ణ అతికష్టం మీద కారులోంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ సుమారు 200 మీటర్ల దూరం పరుగెత్తి, తీవ్ర గాయాలతో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటన అనంతరం నిందితులు కారును శుభ్రం చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని పడేసి పారిపోయారని వెల్లడించారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇక వారి వద్ద నుంచి కారును, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించగా.. మైనర్ బాలుడిని సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications