తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సర్కారు బడులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని గురువారం ప్రకటించారు.
టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్య సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని చెప్పారు.సమాజాన్ని సన్మార్గంలో పెట్టడంలో గురువులది కీలక పాత్ర అని అన్నారు. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఆదర్శమైన గురువులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు ఉపాధ్యాయులు చక్కగా సహకరించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
గురువులు ఎంత గొప్పవాళ్లైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా మన విద్య వ్యవస్థ లేదని, మన రాష్ట్ర విద్య వ్యవస్థ మారాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకే నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని డిప్యటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications