ఆ ప్రాంతానికీ గద్దర్ పేరు పెడతాం.. బీజేపీకి రేవంత్ వార్నింగ్
ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గద్దర్ 77వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాష సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయంగా ఒంటరిననే భావన వచ్చినప్పుడల్లా గద్దర్ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకునేవాడినని తెలిపారు.
నీ బాధ్యత నెరవెర్చు ప్రజలు తప్పకుండా నిన్ను గుర్తించి అవకాశం ఇస్తారని గద్దర్ చెప్పేవారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు గద్దర్ మాట నిజమైందని అన్నారు. గద్దరి తుది శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని సీఎం రేవంత్ కొనియాడారు.

గద్దర్ పేరుతోపాటు గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావుకు పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చారు.. వాళ్లకంటే తాము ప్రతిపాదించిన వాళ్లు తక్కువా? అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన తప్పును సరిదిద్దుకుంటారని లేఖ రాసినట్లు తెలిపిన రేవంత్ రెడ్డి.. తప్పు సరిదిద్దుకోకుండా.. గద్దర్ కు అవార్డు ఇవ్వం అని చెప్పారని తెలిపారు.
అవార్డులు ఇచ్చేది మేమే అని బీజేపీ నేతలు అంటున్నారు. వారి పార్టీ కార్యాలయం తెలంగాణలోనే ఉంది. ఇంకోసారి గద్దర్ గురించి తప్పుగా మాట్లాడితే బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి, కాలనీకి గద్దరన్న పేరు పెడతామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రతిదానికీ తమ దగ్గర మందు ఉందన్నారు. గతంలో గద్దర్ ను అవమానించిన వారికి తగిన శాస్తి జరిగిందన్నారు. గద్దరన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
మరోవైపు, గత బీఆర్ఎస్ సర్కారుపైనా సీఎం రేవంత్ ఫైరయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన గద్దర్ పేరిట అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. ఆయన పేరిట అవార్డు ఇవ్వడమంటే ప్రతియేటా ఆయనను స్మరించుకోవడమేనని అన్నారు. గద్దరన్న మరణించినప్పుడు ఆయన చివరిచూపు ప్రజలందరికీ దక్కాలని ఎల్బీ స్టేడియానికి తీసుకొచ్చామని. .కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేడియం గేట్లకు తాళం వేసిందని మండిపడ్డారు. కొందరు నేతలు గతంలో గద్దర్‌ను ప్రజా భవన్ బయట నిలబెట్టారని.. ఇప్పుడు వారే ఆ భవనం బయట ఉన్నారని రేవంత్ అన్నారు.












Click it and Unblock the Notifications