కన్న తల్లి-పెంచిన తల్లి: ఎవరినీ తేల్చుకోలేక యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ఒకరు రక్తం పంచి జన్మనిచ్చిన తల్లి.. మరొకరు కంటికి రెప్పలా చూసుకుంటున్న పెంచిన తల్లి. వీరిద్దరూ తన కోసం తగవులాడుకుంటుండటంతో.. ఎవరిని దూరం చేసుకోవాలో తెలియక మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లుల కూతురు. ఈ విషాద ఘటన నగర పరిధిలో చోటు చేసుకుంది.
పీరంచెరువు గంధంగూడకు చెందిన లక్ష్మి పదేళ్ల కిందట తన భర్త చనిపోవడంతో వేరే పెళ్లి చేసుకుని కుమార్తె మమ్మీ(20ఏళ్లు-ప్రస్తుత వయస్సు )ని వదిలి వెళ్లిపోయింది. దీంతో మమ్మీని లక్ష్మి అక్క తిరుపతమ్మ పెంచుతోంది.
కాగా, గత నెలలో తన రెండో భర్త కూడా మరణించడంతో తిరుపతమ్మ వద్దకు వచ్చింది లక్ష్మి. తన కుమార్తెను ఇచ్చేయాలంటూ గొడవకు దిగింది. కన్న కూతురులా చూసుకుంటున్న మమ్మీని ఇవ్వలేనంటూ తిరుపతమ్మ తెగేసి చెప్పింది.

గొడవ తీవ్రమవడంతో కల్పించుకున్న స్థానికులు.. ఎవరి వద్ద ఉండాలో తేల్చుకోమంంటూ మమ్మీకి సూచించారు. దీంతో లక్ష్మి వద్ద ఉండేందుకు నిర్ణయించుకుంది మమ్మీ.
ఈ క్రమంలో నాలుగు రోజులుగా అక్కడే ఉంటోంది. పెంచిన కూతుర్ని విడిచి ఉండలేక తిరుపతమ్మ.. లక్ష్మి ఇంటికి వెళ్లి మమ్మీని తనతో పంపించాలంటూ కోరింది. దీంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ గొడవ ఎంతకీ తెగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమ్మీ.. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మమ్మీ మరణంతో ఇద్దరు తల్లులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications