ఉచిత బస్సు ప్రయాణం వేళ .. హైదరాబాద్ ఆర్టీసీకి కేంద్రం శుభవార్త!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో తెలంగాణ రాష్ట్రంలో బస్సుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతీరోజూ ఉద్యోగాలకు, చదువులకు వెళ్ళేవాళ్ళు బస్సు రవాణా ద్వారానే దాదాపు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో, మహిళ ప్రయాణికుల సంఖ్య పెరగడంతో తీవ్ర రద్దీ నెలకొంది.
హైదరాబాద్ నగరానికి బస్సులు.. కేంద్ర సహకారం
హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు తగ్గట్టు బస్సులు అందుబాటులో లేవు. దీంతో బస్సుల సంఖ్యను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి కేంద్రం నుండి కూడా సహకారం అందనుంది. దేశంలోనే సుస్థిరమైన, పర్యావరణ హితమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు
ఈ క్రమంలోనే దేశంలోని మెట్రో నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సిఈఎస్ఎల్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రెడీ అయింది. మొత్తం 10,900 విద్యుత్ బస్సుల కోసం బిడ్ లను ఆహ్వానించింది. ఈ బిడ్ ను నవంబర్ ఆరవ తేదీన తెరవనున్నారు. ఈ విధంగా సేకరించే బస్సులను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు కేటాయిస్తారు.
నగర కాలుష్యం తగ్గించి, అవసరాలు తీర్చే ఈ బస్ లు
ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. హైదరాబాద్ నగరవాసుల అవసరాలను తీర్చడంతో పాటు, నగర కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ బస్సులు కీలకభూమిక పోషించబోతున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం కింద ఈ బస్సులను సేకరిస్తున్నారు. వాయు కాలుష్యాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కేంద్రం దాదాపు 50 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ కు 2000 విద్యుత్ బస్సులు
ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరానికి కేంద్రం నుండి ప్రస్తుతం సేకరించే 10,900 విద్యుత్ బస్సులలో 2000 విద్యుత్ బస్సులు రానున్నాయి. ఈ బస్సులు ఎంటర్ అయితే హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి వీలవుతుంది.












Click it and Unblock the Notifications