తాత కోసం మనవడి ప్రచారం.. కేటీఆర్ తనయుడు హిమాన్షు తగ్గట్లేదుగా!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ తో పాటుగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంటే, ఉన్నత చదువుల కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన కేసీఆర్ మనవడు హిమాన్షు అక్కడ నుండే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాడు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టిన హిమాన్షు ఒక దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అంటూ కెసిఆర్ పరిపాలన తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. కారే రావాలి కెసిఆరే గెలవాలి అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి ప్రచారానికి తెర తీశారు. హిమాన్షు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇస్తుంది.

ఒక దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి.. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు ఇది సరిగ్గా సరిపోతుంది అంటూ పేర్కొన్నారు. ఎంతో పారదర్శకతతో మరెంతో పట్టుదలతో, తపనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కేసీఆర్ నడిపించారు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త విప్లవాన్ని సృష్టించిందని రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు.
సామాజిక సాధికారతకు, పర్యావరణ సుస్థిరతకు కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటు పడిందని, కెసిఆర్ గారి పారదర్శకత, సమర్ధత మరియు సమర్థవంతమైన పాలన యొక్క నమూనా ఇదని హిమాన్షు పేర్కొన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ నిర్మూలన, పాలమూరు నుండి వలసలు లేకుండా చూడడం, మన రైతుల అనేక ఆత్మహత్యలకు దారితీసిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడం కేసీఆర్ వల్లే సాధ్యమైనదన్నారు.
తాగునీటి ఎద్దడి లేకుండా చూడడం, వ్యవసాయ నీటి కొరత లేకుండా చూడడం, బడుగు బలహీన వర్గాల పట్ల అంటరానితనం లేకుండా చూడడం, హైదరాబాద్‌లో అల్లర్లు లేకుండా చూడడం కెసిఆర్ హయంలోనే జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు, మాత శిశు మరణాలు లేకుండా చూడడం, ఆరోగ్య సంరక్షణ అందించడం కేసీఆర్ చేశారన్నారు.
నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఇలా ఎన్నెన్నో చేశారని. అందుకే అందరూ "కార్ ఏ రావాలి, కెసిఆర్ ఏ గెలవాలి" అంటున్నారు అని హిమాన్షు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications