తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్, ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 100 కొత్త పోలీస్ స్టేషన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ, కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో అందుకు ముహూర్తం కూడా ఖరారైంది.
కొత్త ఎక్సైజ్ స్టేషన్ లకు ముహూర్తం ఖరారు
ఏప్రిల్ 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో 13 హైదరాబాదులో ఏర్పాటు చేస్తుండగా, వరంగల్ అర్బన్ లో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉత్తర్వులు జారీ
ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను నిర్వహించడం కోసం అద్దె భవనాలను గుర్తించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు బంజారాహిల్స్, గండిపేట, చిక్కడపల్లి, కొండాపూర్ పెద్ద అంబర్ పేట, కూకట్ పల్లి, అమీన్ పూర్, హసన్పర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు అద్దె భవనాల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది.
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
ఇక మీర్ పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, ఆల్వాల్, మారేడ్ పల్లి, ప్రాంతాలలో అద్దె భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గదులలోనే వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఇవి కార్యకలాపాలు కొనసాగించటనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు.
2020లోనే ఈ 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
కాగా 2020లోనే ఈ 14ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయగా ,ప్రస్తుతం విభజన, ప్రాంతాల నిర్ణయం,బదిలీ ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణా లో కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుండటం త్వరలోనే అవి కార్యాకలాపాలు మొదలుపెట్టనుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications