కాంగ్రెస్ లో వర్గపోరు: చొక్కాలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు.. కారణమిదే!!
అధికారం పోగొట్టుకున్నా, అడ్రస్ లేకుండా పోతున్నా, ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్నా కాంగ్రెస్ పార్టీలో మాత్రం కుమ్ములాటలు ఆగడం లేదు. పార్టీ నేతల వైఖరిలో మార్పు రావటం లేదు. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని, ఎన్నికలకు అందరూ సిద్ధం కావాల్సిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సమిష్టిగా ఉండకుండా గ్రూపులుగా మారి తన్నుకుంటున్నారు.
తాజాగా వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుతో కొట్టుకోవడం చూస్తే వీళ్లు మారరు అని కచ్చితంగా అందరు ఒప్పుకోవాల్సిందే. ఇంతకు ఏం జరిగిందంటే వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో డిసిసి అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకార కార్యక్రమంలో రసాభాస జరిగింది. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు చెప్పులతో కొట్టుకున్నారు.

డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారం చేసి తొలిసారి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కొండా దంపతులు హాజరు కాలేదు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు ఒక్కసారిగా తన్నులాటకు దిగారు. కొండా వర్గానికి చెందిన జిల్లా ఎస్సీసెల్ నాయకుడు సంతోష్ పై ఎర్రబెల్లి స్వర్ణ వర్గం దాడి చేసింది. చొక్కాలు చింపుకొని, చెప్పులతో కొట్టుకుని నానా రచ్చ చేశారు.
దీంతో కార్యక్రమం అంతా గందరగోళంగా తయారైంది. ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వరరావు తమతో గొడవకు దిగిన వాళ్ళ అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం.అయితే ఇది గ్రూప్ వార్ కాదని, కులం పేరుతో ఓ వ్యక్తి దూషించటం కారణంగా నెలకొన్న వివాదం మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు.
ఇక అసలు విషయం ఏమిటంటే ఎర్రబెల్లి స్వర్ణ కు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడంపై కొండా వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదే సమయంలో ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో కొండా దంపతుల ఫోటోలు పెట్టకపోవడంతో నానా రగడ జరిగింది.












Click it and Unblock the Notifications